హెచ్చరిస్తున్న ఆదాయపన్ను శాఖ
ఐటీ రిటర్న్స్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారా? ఉన్నది లేనట్టు .. లేనిది ఉన్నట్లు.. కనికట్టు కానీ చేశారా ? మాయ చేసి ఎలాగైనా రిటర్న్స్ పొందాలని భావిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త . మునుపటి ఐటీ కాదు.. ఇప్పుడు బాగా రాటుదేలింది. ఫాల్స్ ఫైలింగ్స్ ను ఇట్టే పసిగట్టేస్తోంది ఐటీ. అక్రమ పద్ధతుల్లో ఆదాయ పన్ను మినహాయింపులు పొందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించనుంది. ఇంతకు ఫాల్స్ ఫైలింగ్ ను ఐటీ డిపార్ట్మెంట్ ఎలా కనిపెడుతోంది? తప్పులు సరి చేయకుంటే భారీ జరిమానాలు, జైల్లో చిప్పకూడు తప్పదా ? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏఐ టూల్స్..AI Tools
ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి మోసపూరిత ఐటిఆర్ క్లైమ్లను గుర్తిస్తోంది. ఈ టూల్స్ అసాధారణ డిడక్షన్ పాటర్న్లను అనుమానాస్పద రీఫండ్ ట్రెండ్లను గుర్తించడంలో సహాయపడుతున్నాయి. నకలీ ఈ-మెయిల్ ఐడీలతో దాఖలు చేసిన ఐటిఆర్ లు, పన్ను చెల్లింపుదారులకు తెలియకుండా బోగస్ డిడక్షన్లను క్లెయిమ్ చేసిన కేసులు ఎన్నో ఇటీవల కాలంలో బయటపడ్డాయి. హౌస్ రెంట్ అలవెన్స్ ,రాజకీయ విరాళాలు , విద్యా రుణాలు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్, ఎలక్ట్రిక్ వాహనాలు, డొనేషన్స్ , వైద్య ఖర్చులు తదితర రాయితీలను తప్పుగా క్లైమ్ చేసిన వాళ్ళపై ఐటీ కన్నె ర్ర చేసింది. ఆదాయ పన్ను చట్టం 1961 కింద జరిమానాలు, జైలు శిక్షలతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
సులభంగా పసిగట్టేస్తుంది
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు బ్యాంక్, జీఎస్టి ఇతర ఆర్థిక డేటాను ఉపయోగించి తప్పుడు ఫైలింగ్స్ ను సులభంగా పసిగట్టేస్తుంది. నకలి ఈమెయిల్ ఐడిలతో దాఖలైన ఐటిఆర్ లో ఒకే చోట నుంచి వేలాది ఫైలింగ్స్ చేస్తే ఈజీగా గుర్తిస్తోంది. నకిలీ ఐడిలతో ఫైలింగ్స్ దాఖల్ చేస్తే.. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 271సి కింద 100% నుంచి 300% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు తీవ్రమైన మోసాలు చేసిన వాళ్ళపై సెక్షన్ 277 కింద ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో ఏఐ టూల్స్ ను ఇంకా విస్తృతంగా ఉపయోగించి మోసాలు పూర్తిగా నిర్మూలించాలని భావిస్తోంది.
పారదర్శకత అనివార్యం..Transparency is Essential
ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత అనివార్యం. ఆదాయాన్ని తక్కువగా చూపించడం, మోసపూరిత పద్దతుల్లో రిఫండ్లు పొందడం, తప్పుడు ఖర్చుల వివరాలు చూపించడం తగదు. ఇలా చేస్తే ఇకపై తప్పించుకోలేరు. ఆదాయపు పన్ను శాఖ తాజాగా చేపట్టిన ‘డేటా మైనింగ్’, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ఆధారిత పద్ధతుల ద్వారా కఠిన శిక్షలు తప్పవు. పన్ను రిటర్నుల సమర్పణ సమయంలో ఎలాంటి తప్పుడు వివరాలిచ్చినా ఐటీ శాఖ ఈ-వెరిఫికేషన్, నోటీసుల జారీ, దర్యాప్తు, అవసరమైతే జరిమానాలు, శిక్షల దాకా చర్యలు తీసుకుంటోంది.
ఇవి చేస్తే దొరికిపోవడం ఖాయం
- ఫేక్ డిడక్షన్ క్లెయిమ్‌లు
- తక్కువగా ఆదాయ నివేదిక
- మూడో పార్టీ ఖర్చుల డిటైల్స్‌ను మెచ్చని విధంగా చూపించడం
- బినామీ లావాదేవీలు
- భారీ నగదు చలామణి, కానీ ఆదాయపు పన్ను రిటర్నులో పేర్కొనకపోవడం
రెడ్ అలర్ట్
బ్యాంకింగ్, ప్రాపర్టీ, స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డ్, ప్రయాణ ఖర్చులు వంటి అన్ని లావాదేవీలను ఐటీ శాఖ అనలైజ్ చేస్తోంది. మీరు చెప్పిన ఆదాయం, మీరు చేస్తున్న ఖర్చులు సరిపోకపోతే వెంటనే రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది.
ఇప్పటికే వేల మందికి స్క్రూటినీ నోటీసులు వెళ్లాయి. కొందరి ఖాతాల్లోకి జమ అయిన పెద్ద మొత్తాలపై వివరణలు కోరుతున్నారు. అనుమానాస్పద క్లెయిమ్‌లను తిరస్కరిస్తూ, జరిమానాలు విధించడమే కాకుండా.. క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి.
పన్ను చెల్లింపుదారులకు సూచనలు Tips for Taxpayers
- నిజమైన ఆదాయాన్ని మాత్రమే చూపించాలి
- సరైన డాక్యుమెంట్లతో డిడక్షన్ క్లెయిమ్ చేయాలి
- అకౌంటెంట్, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.
- ఫేక్ ఖర్చులు, ఆదాయ వర్గాలు.. ఇవన్నీ రిపోర్ట్ చేయకపోతే శిక్ష తప్పదు
పన్ను చెల్లించడం ఒక బాధ్యత ..Paying Taxes is a Responsibility
ఆదాయపు పన్ను చెల్లించడం ఒక బాధ్యత. దాన్ని తప్పించేందుకు తప్పుడు మార్గాల్లోకి వెళ్లడం నేరం. ప్రభుత్వం తాజాగా ఐటీ చట్టాల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుందామని చూస్తే.. ఇక “మోత మోగిపోవడం” ఖాయం.
సవరించుకునే అవకాశం.. Chance to Rectify
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారందరూ తమ ఆదాయం, పన్నులకు సంబంధించిన వివరాలతో ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఏవైనా తప్పులుదొర్లినప్పుడు వాటిని సవరించుకునేందుకు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అవకాశం కల్పిస్తోంది. దానినే రివైస్డ్ ఐటీఆర్ అంటారు. అంటే ప్రాథమిక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఎవైనా తప్పులు ఉంటే సరిచేయడం, పాత సమాచారాన్ని తొలగించడం వంటివి చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్(Income Tax) చట్టం 1961లోని సెక్షన్ 139(5) అనేది రివైస్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది ఒక భద్రతా వలయంగా ఉపయోగపడుతుంది. తప్పులను సరిచేసుకుని కచ్చితమైన ట్యాక్స్ ఫైలింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే, ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు జులై 31, 2024తో ముగుస్తుందని తెలిసిందే. ఆలోపే ఏదైనా చేయాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.
ఎన్నిసార్లు రివైస్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు
How Many Times Can You File a Revised ITR
ఐటీ నిబంధనల ప్రకారం డెడ్‌లైన్ ముగిసే వరకు మీరు ఎన్నిసార్లైనా మీ ఐటీఆర్‌లో తప్పులు సరి చేసుకోవచ్చు. సరైన సమాచారంతో రివైస్డ్ ఐటీఆర్ ఎన్నిసార్లైనా ఫైల్ చేయవచ్చు. డెడ్‌లైన్ అనేది గుర్తుంచుకోవాలి. సెక్షన్ 139(5) ద్వారా డిసెంబర్ 31వ తేదీ వరకు రివైస్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. పాత అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించినవి అయితే మాత్రం ఐటీ విభాగం సూచించిన తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- సవరించిన ఐటీఆర్‌ని ఫైల్ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. ఏవైనా వర్తించే పన్ను రీఫండ్లను స్వీకరించవచ్చు. మీ పన్నును కచ్చితమైనదని నిర్ధారించొచ్చు. పన్ను అధికారులు మీ రిటర్నులను సమీక్షించేందుకు ఎంపిక చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా జరిమానా పడకుండా చూసుకోవచ్చు. అసలు ఫైల్ అప్డేటెడ్ చేసిన రిటర్నుతో భర్తీ అవుతుంది. ఇది ఆదాయపు పన్ను శాఖ సమీక్షకు వెళ్తుంది. మీ పన్ను రిటర్నులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాసెసింగ్ పూర్తి చేసేందుకు దోహదపడుతుంది.
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.