భక్తి అనేది ఒక వెర్రిగా తయారైంది. భక్తిని కూడా గొప్ప షో లా భావిస్తూ, అందరి ముందూ చూపించుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఆధ్యాత్మికత అనే ముసుగులో అజ్క్షానానికి బానిసలవుతున్నారు. పాపాలు పోతాయనే భ్రమలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హెచ్చులకు పోయి విచక్షణ కోల్పోతున్నారు. చదువురాని వారే అనుకుంటే చదువుకున్న వారు అంతకంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనేది తెలుసుకోకుండా గొర్రెల్లా పరుగులెడుతున్నారు.
వాడు గుడికి వెళ్తున్నాడు.. నేనూ వెళ్లాలి, వాడు పూజ చేస్తున్నాడు.. నేనూ చేయాలి, వాడు మాల ధరించాడు.. నేనూ ధరించాలి. ఇలా తయారైంది మన భక్తి. ఆత్మశుద్ధి లేని ఆచారమే అన్నట్టుంది మన పరిస్థితి. ఈ అజ్క్షానానికి ఆధ్యాత్మికత అనే పేరు పెట్టుకుని ఆనందిస్తున్నాం మనమంతా. అయ్యప్ప స్వాములు లేదా భవానీ భక్తులు అని మాల ధరించిన వారు సైతం తమ నోటిని, మనసును అదుపుచేసుకోలేకపోతే మరి ఆ దీక్షకు అర్థం ఏమిటి? ఇటీవల ఓ అయ్యప్ప భక్తుడు మాలలో ఉంటూనే బీరు తాగిన దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలాంటివి మరికొన్ని జరుగుతుండవచ్చు. మరి ఇది దేనికి సంకేతం.
మనసును నివేదించడం మానేసి కేవలం వస్తువులను మాత్రమే దేవుడి సన్నధికి తీసుకెళ్లే పిచ్చి తనం ఇటీవల ఎక్కువయ్యింది. సోషల్‌మీడియాలో వచ్చే మతిలేని సూక్తులు, కాషాయ రంగు పులుముకున్న కొంతమంది అప్రకటిత బాబాలు చెప్పే ఆలోచనా రహిత సందేశాలు, ఆచారాలు ప్రజల బుర్రలను అజ్క్షానంలో ముంచుతున్నాయి. దీంతో సాధారణ భక్తులు కాస్తా ఉన్మాదుల్లా తయారవుతున్నారు.
ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోయిన ఘటనల్లో బాధ్యులెవరు? బాధితులైన ఆ కుటుంబాలకు, పోయిన ఆ ప్రాణాలకు సమాధానం ఏమిటి?
మంచి రోజు, మంచి ఘడియ, మంచి పూట, మంచి ఆలయం, మంచి దేవుడు.. ఇలా అనుకుంటూ వెళ్లి ప్రాణాలు ధారపోస్తున్నారు. ఎవరు చెప్పిన శాస్త్రం ఇది. ఎక్కడ రాయబడిన లెక్కలివి?
దేవుడంటేనే గొప్పవాడైనప్పుడు ఇంక మంచి దేవుడు, మంచి ఆలయం ఏమిటి? అలాంటి మంచి దేవుడిని దర్శించుకునేందుకు మంచి రోజేంటి? మంచి ఘడియ ఎందుకు? కొందరు మేధావులు, సిద్ధాంతులు దీనికి ఏదో ఒక వక్రభాష్యం చెప్పవచ్చు. కానీ వారి ప్రాణాలు మాత్రం ఎప్పడూ పోవు కదా.. వారి పిచ్చి మాటలకు బలయ్యేది మాత్రం సాధారణ ప్రజలే.
ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమై ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. అటు దేవుడిని ఏమీ అనలేక, భక్తి అనే వ్యసనాన్ని మానుకోలేక ప్రజలు బాధితులవుతునే ఉన్నారు. ఇది సాగుతునే ఉంటుంది. ప్రమాదాలు సహజమే కావచ్చు.. ఎక్కడోచోట, ఏదో ఒక ప్రమాదం ప్రతినిత్యం జరుగుతుండవచ్చ. మరణాలూ సంభవిస్తూ ఉండవచ్చ. కానీమనశ్శాంతిని కోరుకుని వచ్చి, హాయిగా, ప్రశాంతంగా ఉండాల్సిన చోట ఇలాంటివి జరగడం ఎంత వరకు సమర్థనీయం?
ప్రజల్లో అజ్క్షానం పెరిగితేనే భక్తి పుడుతుంది అని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇలాంటి ఘటనలు చూసినప్పడు ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఆలయాల్లో తొక్కిసలాటలు పక్కన పెడితే దొంగబాబాల మాటలకు బలై, వారి చేతిలో మోసపోయి, నిలువుదోపిడీకి గురైన అమాయకులు కళ్ల ముందు కనిపిస్తున్నా వెర్రి భక్తులు వారికి భజన చేస్తునే ఉంటారు.. కొత్త బాధితులు సిద్ధమవుతునే ఉంటారు.
ఇలాంటివి మార్చేందుకు ఎలాంటి వ్యవస్థలూ రావు, సంఘాలూ ఉండవు. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించింది. ప్రజల సున్నితమైన మనోభావానికి ముడిపడినది. ప్రాణాలు పోయినా, జీవితాలు కోల్పోయినా పర్లేదు కానీ మన మనోభావాలు మాత్రం దెబ్బతినకూడదు. ఇదీ మన అభ్యదయ సిద్ధాంతం. అందుకే ఇలాంటి వాటిపై ఎవరూ ప్రశ్నించలేరు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని హిందూ వ్యతిరేకి అంటారు. ఇతర మతాల్లో లేవా ఇలాంటి వెర్రితనాలు? మరి వారిని ప్రశ్నించరేం అని ప్రతిదాడి చేస్తారు. ఇటీవల కాలంలో ఈ పైత్యం మరీ ముదిరి ఏదైనా అప్రశ్రుతికి కారణం అడిగితే మనల్ని దేశద్రోహులు అని ముద్ర సైతం వేసేస్తున్నారు. మరి ఎలా ఈ పిచ్చితనాన్ని ప్రశ్నించేది. నా అమాయక భక్త జనాలని ఎలా ఈ పైత్య విముక్తులను చేసేది?